ఎంపీ బాల శౌరి (Balashowry) జనసేన గూటికి చేరారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో జనసేనలో చేరారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీతో జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బాల శౌరికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ….ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం తనకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. జనసేనలోకి రావడంతో ఆనందంతో తనకు ఊపిరి ఆడటం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా తృప్తిగా అనిపించిందన్నారు.
రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగ లేదని ఆరోపించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి 2019లో ఓట్లు అడిగింది గుర్తులేదా..? అని జగన్‌ను ప్రశ్నించారు. 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు.
సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దమ్ము, దైర్యంతో సమస్యలపై గొంతు ఎత్తే వ్యక్తి పవన్ అని కొనియాడారు పవన్‌తోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే తాను జనసేనతో కలిసి నడుస్తున్నానని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.