తెలంగాణ (Telangana) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) అధ్యక్షతన నేడు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని తెలిపారు. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఈ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ( State Anthem) ప్రకటించామని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సోషల్ మీడియా వేదిక ట్విటర్ (X)లో ముఖ్యమంత్రి పోస్టు చేశారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే అయిదు వందలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు విద్యుత్ ప్రీ పథకాలపై కూడా క్యాబినేట్ చర్చించింది.. ఈ నెలలో ఈ రెండు పథకాల అమలు కార్యచరణకు ఆమోద ముద్ర వేసింది.
మరోవైపు వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చాలని భావించిన ప్రభుత్వం.. టీజీ (TG) అనే అక్షరాలనే తీసుకురావాలన్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొంది.. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే గతంలో రాష్ట్ర గీతం ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ (KCR) దీన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురాలేకపోయారని అన్నారు.
కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి కృషి చేసిందని తెలిపారు.. ఇక ఈ కేబినెట్ భేటీలో రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకొంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వంలో అమలు కానిది తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.. రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు.