తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని తొమ్మిది డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న 60 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. టీఎస్పీఎస్సీ (TSPSC) ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు ప్రాసెస్ మొదలైంది.
మరోవైపు రాష్ట్రంలోని వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గ్రూపు-1 పోస్టుల వివరాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలనే నిర్ణయం తీసుకొన్నది. అత్యధికంగా డీజీపీ (DIG), ఐజీ (IG) ఆఫీసుల్లో 24 డీఎస్పీ పోస్టులు, పంచాయతీరాజ్ డిపార్టుమెంటులో 19 ఎంపీడీవో (MPDO) పోస్టులు ఉన్నట్లు తేలింది.
ఈక్రమంలో మొత్తంగా 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగా వీలైనంత తొందరగా భర్తీ చేయడానికి పక్రియ మొదలు పెట్టింది.ఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ను జారీ చేయించి ఫిలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆయా డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను, నేరుగా కమిషన్‌కు పంపాలని ఫైనాన్స్ డిపార్టుమెంట్ (Finance Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మూడు రోజుల క్రితం జీవో నెం.16 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.