కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ (KCR) విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మూర్ఖపు వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించిన ఆయన కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణ (Telangana)కు రావాల్సిన వాటాను, హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని అన్నారు. నేడు మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం (Khammam), నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే’ అనే ప్రజా నినాదాన్ని.. స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టుల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
మరోవైపు కృష్ణా జలాల అంశంపై పోరాటం చేసేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయేలా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండించారు. సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ సాధించి.. రాష్ట్ర హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితో.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదన్నారు. తెలంగాణ ఉద్యమకారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి.. సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నది ప్రాజెక్టులను అప్పజెప్పి.. మన జుట్టు కేంద్రం చేతికి అందించిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎండగడుతామని ప్రకటించారు.