పంజాబ్ (Punjab) ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా స్వీకరిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం విచారణను చేపట్టింది. అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ వర్గీకరణ (SC Classification)పై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు.. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.
వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను కూడా విచారించింది. అయితే వర్గీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను పంజాబ్ పిటిషన్‌కు న్యాయస్థానం జత చేసి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) గతంలో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ (Damodara Rajanarsimha) హాజరయ్యారు.
మరోవైపు చంద్రబాబు ప్రభత్వ హయాంలో 2004లో కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకొన్న ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టి, ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వపక్షాన సీనియర్ న్యాయవాది వివేక్‌ను నియమించామని తెలిపారు.
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, ఆదివాసీలు అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించిందన్నారు. గద్దర్, అందెశ్రీ లాంటి గాయకులను బీఆర్ఎస్ విస్మరించినా, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టుపై సంపూర్ణమైన విశ్వసం ఉందని పేర్కొన్నారు.