తెలంగాణ (Telangana)అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంతో మొదలైన ఈ సమావేశాలు రణరంగాన్ని మరిపించేలా సాగానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్టులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరుగుతుంది. అది సభపై ప్రభావం చూపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెలు తొలగాయని.. ప్రజాభవన్ లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించాయని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని కొనియాడారు. ప్రజాస్వామ్యం కోసం రాష్ట్ర ప్రజలు పోరాటం చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం భారీగా నష్టపోయి.. అప్పులపాలైందని.. కొలుకోకుండా చిన్నాభిన్నం చేసి మాకు అప్పగించారని చురకలు అంటించారు. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకొంటూ ఇన్నాళ్ళూ జనాన్ని మభ్యపెట్టిన బీఆర్ఎస్ (BRS).. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని.. విలువలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిందని వెల్లడించారు. రాష్ట్రాన్ని పునర్నిమించే ప్రయత్నం ప్రభుత్వంతో కలిసి చేస్తున్నామని వివరించారు.
ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్దపడుతోందని తెలిపారు. త్వరలో అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందుతుందని అన్నారు.. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉంది కాబట్టి.. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు.
మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించిన అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటో వాలాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఆటోలో వచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను ప్రొజెక్ట్ చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బస్సులో అసెంబ్లీకి వచ్చారు.