తెలంగాణ (Telangana)లో అత్యంత వైభవంగా జరగనున్న సమ్మక్క సారలమ్మల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. నేడు మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న సీతక్క.. జాతరకు భక్తులు (Devotees) పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే మేడారం మహా జాతర (Maha jathara)కు వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుందని సీతక్క తెలిపారు. ఈ నెల 23 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు ఆమె వివరించారు.
ఈ జాతర సందర్భంగా 4000 వేల మంది పారిశుధ్య కార్మికులను, వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్ లు, ఆర్టీసి మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లు, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీఐపీ, వివీఐపీల తాకిడితో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు..