తెలంగాణ (Telangana) రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందడంతో.. ఒక్క సారిగా ఆ పార్టీ నేతల అంచనాలు తారుమారు అయిన సంగతి తెలిసిందే.. పులిలా గర్జించిన వారు సైతం ప్రస్తుతం పిల్లిలా సైలంట్ అవడం కనిపిస్తోంది.. అందులో గులాబీ బాస్ ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో.. సముద్రంలోని అలలా ఎగిసి ఎదిగిన బీఆర్ఎస్.. ఒక్క సారిగా ఎండిపోతున్న రొయ్యల చెరువులా మారిందంటున్నారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీఆర్ఎస్ హవా ఇంతకు ముందు ఉన్నట్లు ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. కానీ ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థులపై కనీసం లీకులు ఇవ్వలేదు. నామినేషన్ల గడువు మూడు రోజుల్లో ముగుస్తున్నా ఇంకా పేర్లపై ఎలాంటి స్పష్టతకు రాలేదు.
అయితే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక్క సీటు లభిస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో రాజ్యసభ సీటు అంటే చెప్పాల్సిన పని లేదు. రేసు ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఎవరెవరు బరిలో ఉంటారనేది ఉత్కంఠంగా మారింది. రాహుల్ యూపీ నుంచి పారిపోయారని.. సోనియా రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని ఇటీవల ప్రధాని మోదీ పార్లమెంట్ లో పరోక్షంగా సెటైర్లు వేశారు.
నిజానికి కాంగ్రెస్ నేతలు ఖమ్మం నుంచి పోటీ చేయాలని సోనియాను కోరుతున్నారు. రెండో సీటు తెలంగాణ నేతలకే లభిస్తుంది. కానీ వారు ఎవరన్న అంశం రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుందని వెల్లడిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తమ అభ్యర్థి విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది. బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉంటే మూడో స్థానం కూడా కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు.