ఉక్రెయిన్(Ukraine)పై దాడుల సమయంలో రష్యా(Russia) మరో క్షిపణిని ప్రయోగించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా హైపర్సోనిక్ జిర్కాన్ క్షిపణి(Hypersonic Zircon missile)ని ప్రయోగించింది.
ఈ విషయాన్ని కీవ్‌లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం వెల్లడించారు. ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌లో జరిగిన దాడిలో కనీసం ఐదుగురు మృతిచెందగా నివాస ప్రాంతాలు ధ్వంసమై తీవ్రనష్టం వాటిల్లింది. అయితే ఈ విషయమై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ రూవిన్ తన టెలిగ్రామ్ ఛానెల్లో కీలక విషయాలను ప్రస్తావించారు. అందులో క్షిపణి ప్రయోగానికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని తెలిపారు. క్షిపణి శకలాలు, వాటిపై రాసి ఉన్న వర్ణన జిర్కాన్ అని రుజువైందని చెప్పారు. ఇక, క్షిపణి శిథిలాలను చూపించే వీడియోను అలెగ్జాండర్ రూవిన్ పోస్ట్ చేశారు.
ఈ క్షిపణి ధ్వనివేగం కంటే తొమ్మిదిరెట్లు ఎక్కువ వేగంతో వెయ్యి కిలోమీటర్లు దూసుకెళ్తుందని చెప్పారు. సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 జూన్‌లోనే రష్యా జిర్కాన్ పరీక్షను పూర్తి చేసినట్లు చెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త తరం ఆయుధ వ్యవస్థలో భాగంగా జిర్కాన్‌ను అభివర్ణించారని గుర్తుచేశారు.