కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా హస్తం నేతలు సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని వెలికితీసే పనిలో పడింది. రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకున్నారని పేర్కొంది. ఈ సమయంలో కాగ్ కీలమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
కాగ్ ఇచ్చిన నివేదికపై ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగిందనే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) తెలిపిందన్నారు. ఆ ఆరోపణలు వాస్తవవేనని, రాజ్యాంగబద్దమైన సంస్థ కాగ్ ఇచ్చిన నివేదిక ఇందుకు నిదర్శమని వెల్లడించారు.
నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో అవకతవకలను కాగ్ ఎత్తిచూపిందని తెలిపారు. ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరుకోకపోగా ఖజానాపై పెను భారం మోపిందని కాగ్ ఆక్షేపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోజనాలు ఎక్కువ చూపి, ఖర్చులను తక్కువ చూపారని, కానీ రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కాగ్ స్పష్టం చేసిందన్నారు.
కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని తెలిపిన జూపల్లి.. గొర్రెల పంపిణీ పథకంలో కూడా గోల్ మాల్ జరిగినట్లు కాగ్ వెల్లడించిందన్నారు.. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, ఆసరా పింఛన్ల పంపిణీలో అవకతవకలు, దుబారా ఖర్చులు, స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదాయం వంటి అంశాలపై వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గతం చేసిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో దోపిడి తప్ప అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.. ఇది నేను అంటూన్న మాటలు కావని.. కాగ్ తన నివేదికలో వెల్లడించిన అంశాలని జూపల్లి కృష్ణారావు తెలిపారు.. అవినీతి అంటే తెలియని నీతివంతుల్లా ప్రవర్తిస్తున్న నేతలు కాగ్ రిపోర్టుకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ పాపాలు పండే సమయం వచ్చిందని విమర్శించారు..