మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ (Sai Dharam Tej) తాజాగా నటిస్తున్న మూవీ.. గాంజా శంకర్ (Ganja Shankar).. ఈ టైటిల్ చూస్తేనే అర్థం అవుతోంది. మాదక ద్రవ్యాల మాఫీయా స్టోరీ అని.. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో షాకిచ్చింది. చిత్ర టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ టైటిల్ ను మార్చాలంటూ చిత్ర యూనిట్ కు నోటీసులు ఇచ్చారు.
మరోవైపు విద్యార్థులు, యువతపై ప్రభావం చూపేలా ఈ మూవీ టీజర్ ఉందని ఆగ్రహం వ్యక్త చేస్తూ.. సినిమాలో గంజాయి, మాదకద్రవ్యాలు వంటి వాటిని ప్రోత్సహించేలా సీన్స్ ఉంటే తొలగించాలని ఆదేశించారు. సినిమాలో గంజాయికి సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ (NTPS) 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సీన్స్, డైలాగులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
సమాజం పట్ల సినిమా నటులు బాధ్యతో నడుచుకోవాలని.. వారు చేసే పనుల ప్రభావం విద్యార్థులపై, యువతపై పడుతుందని తెలిపారు. సినిమా హీరోలు చేసినట్లుగా యువత అనుసరించే ప్రమాదం ఉంటుందని నార్కోటిక్ పోలీసులు (Narcotics Police) పేర్కొన్నారు. కాబట్టి గాంజా అనే పేరు తొలగించాలని సూచించారు.. ఇకపోతే గాంజా శంకర్ మూవీ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ మూవీ టీజర్ ఇటీవల సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.. ఇందుకోసం ప్రత్యేకమైన టీముల్ని సైతం ఏర్పాటు చేశారు. గంజాయి తో సహా ఎలాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నా వదిలి పెట్టడం లేదు. ఈ క్రమంలో గాంజాను ప్రోత్సహించే విధంగా మూవీ ఉండటం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది.