నటుడు, ‘మక్కల్ నీది మయ్యమ్’ (Makkal Needhi Maiam) అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Hasan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పొత్తులు పెట్టుకోబోతోందని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఈ మేరకు ఓ ప్రకటన చేస్తానని పేర్కొన్నారు.
తన రాబోయే చిత్రం ‘థగ్ లైఫ్’షూటింగ్ కోసం కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. షూటింగ్ ముగిసిన అనంతరం ఆయన సోమవారం చెన్నై ఎయిర్ పోర్టులో దిగారు.
చెన్నై విమానాశ్రయంలో మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు తమ పార్టీ సన్నాహాలను గురించి ఆయన వివరించారు. ఎన్నికల పనులు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మరో రెండు రోజుల్లో ఒక మంచి శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని తెలిపారు. తాము ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నామని తెలిపారు. పొత్తులకు సంబంధించి మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటరీ ఎన్నికలకు ముందు కమల్ హాసన్‌కు చెందిన ఎంఎన్ఎంతో పొత్తు పెట్టుకోవాలని తాము అనుకుంటున్నట్టు ఒక హింట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో పొత్తులపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని ఉదయ్ నిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.