Telugu News » Vijaya Sankalpa Yatra : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్.. పూరించిన సమరశంఖం..!

Vijaya Sankalpa Yatra : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్.. పూరించిన సమరశంఖం..!

వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్‌సభ స్థానాలు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితర పార్టీల సీనియర్‌ నేతలు పాల్గొంటారని సమాచారం.

by Venu

*లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అడుగులు..
* రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళికలు..
*5 క్లస్టర్లలో 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలకు శ్రీకారం..

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు.. కానీ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో కమలం వికసించలేదు. ఈ దశలో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కాషాయం అధిష్టానం.. సత్తా చాటాలనే ఉద్దేశంతో వ్యూహారచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేలా సిద్దం అవుతున్నారు.

ఈ మేరకు బీజేపీ అధిష్టానం 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా నేడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్​రెడ్డి (Kishan Reddy) ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్పయాత్ర (Vijay Sankalp Yatra) ప్రారంభించినట్లు తెలిపారు. ప్రచారంలో భాగంగా రోడ్‌ షోలు నిర్వహిస్తూ, ప్రజలను కలుస్తూ యాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వచ్చే నెల 2వ తేదీన యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్‌సభ స్థానాలు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay), ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితర పార్టీల సీనియర్‌ నేతలు పాల్గొంటారని సమాచారం. ఇక యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మోడీ సారథ్యంలో పదేళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు బస్సుయాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద కుమురం భీమ్ క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రారంభించనున్నారు.

యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోదన్‌లో ముగుస్తుందని తెలిపారు.. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. పాతబస్తీ ముస్లిం సోదరలు కూడా మోడీ గెలవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ సంకల్పయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. యాత్ర మొత్తాన్ని రోడ్‌షోల ద్వారానే నిర్వహిస్తామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment