తెలంగాణ (Telangana) గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో టీఎస్పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకొంది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోట్ ను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఏప్రిల్ 2022 లో 503 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఇది వరకు పేపర్ లీకేజీ అయ్యిందని, ప్రమాణాలు సరిగ్గా పాటించలేదని పలుమార్లు గ్రూప్ వన్ రద్దయింది. తాజాగా, తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీఎస్పీఎస్సీ ను సమూలంగా ప్రక్షాళన చేశారు. దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీకి చైర్మన్, సభ్యులను నియమించారు. అదే విధంగా గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేశారు. సుప్రీంకోర్టులో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకొన్నారు.
ఈమేరకు సోమవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా.. తాజాగా యాడ్ చేసిన పోస్టులను కలిపి త్వరలోనే 563 కొత్త పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు సన్నాహలు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ ను నిరంతరం కొనసాగించాలని సీఎం రేవంత్ సూచించారు.
మరోవైపు వందలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్-1 పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొన్న సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది.