Telugu News » Telangana : పొత్తు పెట్టుకొని రేవంత్ కు పోటు పోడుద్దాం అంటే.. మా ఖర్మ ఇలా ఉందేంటి..?

Telangana : పొత్తు పెట్టుకొని రేవంత్ కు పోటు పోడుద్దాం అంటే.. మా ఖర్మ ఇలా ఉందేంటి..?

పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీలోపు రానుందనే టాక్ వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో మొదటి విడతలో జరిగే అవకాశం ఉంది.

by Venu
brs parliamentary party meeting tomorrow topics to be discussed are

బీఆర్ఎస్ (BRS)కు ఏమైంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. మరోవైపు తరుముకొస్తున్న పార్లమెంటు ఎన్నికలు (Parliament Elections).. అయినా ఉలుకు పలుకులేని అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పార్టీ వర్గాలలో ఆందోళన కలిగిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నాకు రాజకీయాలు ఒక లెక్క కాదు.. వద్దనుకుంటే ఫామ్ హౌస్ లో ఉంటా.. అని గతంలో గులాబీ బాస్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొంటున్నారు..

ఏది అయితే ఏమి.. ప్రజలు బీఆర్ఎస్ తీరుతో విసుగెత్తారని సృష్టంగా అర్థం అయ్యింది.. కానీ అధికారంలో ఉన్నని రోజులు ఊకదంపుడు మాటలు దండిగా దంచి.. ఓడిపోగానే గమ్మున ఉండటం.. పార్టీ భవిష్యత్తుపై అసలు పట్టింపు లేకుండా నామమాత్రంగా ప్రవర్తించడం వంటి ఘటనలు బీఆర్ఎస్ ను నమ్మి బతుకుతున్న వారికి కాళరాత్రిలా మారాయని భావిస్తున్నారు. ఇలాగైతే త్వరలో కారు స్క్రాప్ కు వెళ్ళడం ఖాయమని ఆందోళన చెందుతోన్నట్లు ప్రచారం మొదలైంది.

మరోవైపు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీలోపు రానుందనే టాక్ వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ (Telangana)లో మొదటి విడతలో జరిగే అవకాశం ఉంది. అయినా గులాబీ తోటలో ఇక వికసించమనే నిర్లిప్తత కనిపిస్తోందని అనుకొంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల వ్యూహంపై నిర్దేశాలు గానీ, అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు  చేస్తున్నట్లు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదంటున్నారు.

కీలకమైన సమయంలో కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్‌కు పరిమితం కాగా, కేటీఆర్ (KTR) విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక నల్లగొండ బహిరంగ సభ తర్వాత వరుస కార్యక్రమాలు ఉంటాయని భావించారు. కానీ అలాంటి ఉద్దేశ్యాలు లేనట్లుగా అధిష్టానం ఉండటం చర్చకు దారితీస్తుంది. మరోవైపు హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ అని.. కేటీఆర్, హరీష్ పాదయాత్ర అని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి.. అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇలాంటి వాటికి ఛాన్స్ ఉండదు.

మరోవైపు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మాత్రం దూకుడుగా వ్యవహరించడం కనిపిస్తోంది. ఇప్పటికే మొత్తం 17 స్థానాలకుగాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న బీజేపీ సైతం లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకొనే ప్రయత్నంలో నేతలున్నారు.

కానీ బీఆర్ఎస్ మాత్రం.. మాకేంటి.. కావలసినంత సంపాదించుకొన్నాం.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కూలితే అధికారం మాదే.. మాకు పోటీ ఎవరు రారు అనే ఊహల్లో విహరిస్తున్నట్లు చర్చించుకొంటున్నారు.. ఇక పొత్తు పెట్టుకొని రేవంత్ కు పోటు పోడుద్దాం అంటే.. బీజేపీ కనుచూపు మేరలోకి రాకుండా తరుముతోందనే భావనలో అధిష్టానం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయినా వచ్చేది వేసవి కాలం మండే ఎండల్లో రాజకీయ సెగలు ఎవరికి కావాలి.. హాయిగా ఏసీ నుంచి వచ్చే చల్లగాలి అనుభవిస్తూ రెస్ట్ తీసుకొంటే సరిపోదా అని ముఖ్య నేతలు భావిస్తున్నారు కావచ్చని కొందరు సెటైర్ వేస్తున్నారు..

You may also like

Leave a Comment