రాష్ట్రంలో కారు సీట్లు ఖాళీ అవుతున్నాయి.. హస్తాన్ని పట్టుకునే వారు పెరిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (Srilata Shobhan Reddy) కాంగ్రెస్ గూటికి చేరారు.. గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో నేడు పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. కాగా బీఆర్ఎస్‌కు (BRS) శనివారం శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బై బై చెప్పారు.
ఇదిలా ఉండగా తమకు పార్టీ విధానాలతో నష్టం వాటిల్లిందని కేసీఆర్‌కు రాసిన రాజీనామా లేఖలో శ్రీలత పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లో పాతికేళ్లుగా ఉన్నామని, ఉద్యమ సమయంలో సైతం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఇంత చేసినా పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడినట్లు వెల్లడించారు.
ఇక డిప్యూటీ మేయర్ తో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతూ, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ (Congress) కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శ్రీలత శోభన్ రెడ్డి మంచిపనిచేశారని అభినందించారు.
బీఆర్ఎస్‌లో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ఎప్పుడూ అవమానమే ఉంటుందని అన్నారు. ఇతర పార్టీల నుంచి చివర్లో వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం బీఆర్ఎస్ లో ఆనవాయితీగా వస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ అహంకార ధోరణి కనిపించదని.. అందరికీ ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు.. బీఆర్ఎస్ పాలనలో లా రాజు వేరు భటులు వేరు అనే కట్టుబాట్లు ఉండవని అన్నారు..