వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బండి సంజయ్(Bandi Sanjay) కొత్త డ్రామాలు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.
రాముడి పుట్టుక, అక్షింతల గురించి మాట్లాడితే తల్లి జన్మకు సంబంధించి బండి మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రను కొనసాగించాలని బండి సంజయ్ చూస్తున్నారంటూ విమర్శించారు. ఇదంతా ఆయన యాత్రకు ప్రచారం కోసమేనని ఆరోపించారు. తాము ఎవరి యాత్రలను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
తాము హింసావదులం కాదని.. శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంతకన్నా కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ‘‘యాత్రలు చేసుకోండి ఏమైనా చేసుకోండి.. మేం కాంగ్రెస్ పార్టీ వాళ్లం.. మేము యాత్రకి అడ్డుపడతలేం.. నాలుక ఒళ్లు.. దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్..’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజా స్వామ్యం యాత్రలు చేసే హక్కు ఎవరికైనా ఉందన్నారు. కానీ, తల్లి జన్మ గురించి బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజలు కూడా సహించరన్నారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. భార్య మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ ఇలా తన తల్లి గురించి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.
బీజేపీ అధిష్టానం ఇలాంటి నాయకులను సమర్థిస్తుందా? అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఓడిపోతానే భయంతో ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ హిందూగాళ్లు, బొందుగాళ్లు అంటే రాజకీయంగా ఎన్నికల్లో ఏవిధంగా వాడుకున్నారో.. ఇప్పుడు తన తల్లిపై చేసిన మాటలూ బండి సంజయ్ రాజకీయ సమాధికి కారణమవుతుందని ధ్వజమెత్తారు.
అదే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానన్నారు.
అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే అందుకు పొన్నం రెడీనా అని సంజయ్ సవాల్ విసిరారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు సంజయ్. రాముడ్ని ఎవరైనా అంటే బరాబర్ కౌంటర్ ఇస్తానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రి పొన్నం రెచ్చగొడుతున్నాడని, హుస్నాబాద్‌లో ప్రజాహిత యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక ఈ పనులు చేయిస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.