ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు (Naga Babu) తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ.. ఓ నోట్ విడుదల చేశారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన 5 అడుగుల 3 అంగుళాలు అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇండస్ట్రీలోని ఓ హీరోను ఉద్దేశిస్తూ.. నాగబాబు ఈ కామెంట్స్ చేశారని, ఆయనను ఆ హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అయితే, ‘పోలీస్ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ.. కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ నాగబాబు వివరణ ఇచ్చారు.
మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై వరుణ్ తేజ్ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి
చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని తెలిపారు. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మార్చి 1న తెలుగు, హిందీలో విడుదల కానుంది.