కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణంపై కాంగ్రెస్ సర్కార్(Congress Govt) మాటల దాడులకు దిగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) శుక్రవారం(నేడు) చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. కేసీఆర్ మినహా మిగతా ముఖ్యనేతలంతా బీఆర్ఎస్ భవన్ నుంచి ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్లారు.
మేడిగడ్డకు బయలుదేరే ముందు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని సూచించారు.
అదేవిధంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరందించేలా కేసీఆర్ నిర్మించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కరువు లేకుండా చేసేందుకే కాళేశ్వరం నిర్మించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవి లేనివన్నీ కల్పించి చెబుతోందని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ దుష్ప్రచారాలు మానుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడిగడ్డ ఆనకట్టలోని 84 పిల్లర్లలో మూడు మాత్రమే కుంగాయన్నారు. లోపాలను సవరించాలే కానీ రాజకీయాలు చేయొద్దన్నారు. బీఆర్ఎస్ నేతలు తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.