పారిశ్రామికవేత్తలకు తెలంగాణ బెస్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. సీఐఐ తెలంగాణ స్టేట్ అన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ భూతల స్వర్గమని అభివర్ణించారు.
దేశంలో ఎక్కడా లేని మౌలిక వసతుల కల్పనకు మంచి వాతావరణం రాష్ట్రంలో ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొక్కజొన్న, టమాట, మిర్చి, పత్తి తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు కలగడంతో పాటు ప్రజలను నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందుతాయన్నారు. వాణిజ్య పంటల ఉత్పత్తి ద్వారా రైతులు ఆర్థికంగా బలపడటంతో పాటు పరిశ్రమల యజమానులు సైతం ఆదాయం పొందవచ్చన్నారు.
అన్ని విధాలుగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటునకు కాంగ్రెస్ ప్రణాళికలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువుగా ఉన్న ప్రభుత్వం ఎంఎస్ఎంఎస్ఈలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని భట్టి తెలిపారు.