– ప్రమాదంలో బీఆర్ఎస్ ఉనికి
– బీజేపీ పుంజుకుంటే కష్టమే
– ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
– బీఆర్ఎస్ పని అయిపోయిందన్నట్టుగా మాటలు
– వైరల్ అవుతున్న పీకే కామెంట్స్
– ఆంధ్రాలో జగన్ పార్టీ ఔట్
– ప్యాలెస్లో కూర్చుని పథకాల పేరుతో డబ్బులు ఇస్తే ఓట్లు రావు
– అభివృద్ధి కూడా జరగాలి
– టీడీపీ-జనసేన కూటమిదే విజయమన్న పీకే
ఓవైపు వలసలతో అల్లాడిపోతోంది బీఆర్ఎస్. పార్టీ ఉనికే ప్రమాదంలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తానే బీఆర్ఎస్ కార్యకర్తను అయ్యి ఉంటే, ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితిపై కచ్చితంగా ఆందోళన చెందేవాడినని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి సంక్షోభంలో పడినట్టేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు. ఇందులో ఇద్దరు బీజేపీ కండువా కప్పుకోగా, వారికి టికెట్లు దక్కాయి. ఈ నేపధ్యంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ పని అయిపోయినట్లే అని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొన్నాళ్లు కలిసి పని చేశారు. ఈయన తనకు మంచి స్నేహితుడు అని కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ లో ఉన్నారు.
మరోవైపు, ఆంధ్రా రాజకీయాలపైనా మాట్లాడారు పీకే. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి విజయం తథ్యమని తేల్చేశారు. జగన్ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఆయన ప్యాలెస్లో కూర్చుని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని.. దాని వల్ల ఓట్లు పడవని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంచనా వేశారు.
జగన్ ఈసారి ఏం చేసినా గెలవడం కష్టమని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో జగన్కు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. 2019 ఎన్నికల్లో అత్యధిక సీట్లతో గెలవబోతున్నారని ఆ సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 151 సీట్లలో వైసీపీ గెలిచి ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు కోల్ కతా, ఢిల్లీ ఎన్నికల్లోనూ పీకే అంచనాలు కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించబోతోందని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.