భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తైవాన్ మంత్రి(Taiwan Minister) చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు దారితీసింది. అయితే ఆమె వ్యాఖ్యలను కొందరు ‘జాత్యహంకారం’గా పరిగణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మంత్రి హ్సు మింగ్-చున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు తెలిపారు.
కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్(Hsu Ming-chun) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వారి చర్మం రంగు, ఆహారపు అలవాట్లు మనకు దగ్గరగా ఉన్నందున ఈశాన్య భారతదేశం నుంచి కార్మికులను నియమించుకోవడంపై మంత్రిత్వ శాఖ మొదట దృష్టి సారిస్తుంది’ అని అన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్చ మొదలవడంతో ఆమె స్పందించారు. తన వ్యాఖ్యలు వివక్ష చూపడానికి ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన సభ్యుడు చెన్ కువాన్-టింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తైవాన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వలస కార్మికులను నియమించుకోవడానికి చర్మం, రంగు, జాతి ప్రమాణాలు కాకూడదని వాదించారు.
అయితే మంత్రి హ్సు మింగ్-చున్ స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలోని వ్యక్తులు, ఎక్కువగా క్రైస్తవులు, తయారీ, నిర్మాణం, వ్యవసాయంలో నైపుణ్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. భారతీయ కార్మికుల సామర్థ్యాలు, పనితీరును హైలైట్ చేయాలనే తన ఉద్దేశాన్ని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
మరోవైపు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా భారతీయ కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ‘పూర్తిగా తగినది కాదు’ కథనాలను అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పింది. తైవాన్ విభిన్న అభిప్రాయాలను స్వీకరించే పౌర సమాజాన్ని కలిగి ఉందని, విస్తృత శ్రేణి స్వరాలను వినడానికి అనుమతిస్తుంది అని ప్రకటనలో పేర్కొంది.