కాంగ్రెస్ సర్కార్ ‘రైతు నేస్తం’(Raithu Nestham) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwar Rao) బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ల అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.97కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.4.07కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడం ద్వారా రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతీ మంగళ, శుక్రవారాలు విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు.