దేశవ్యాప్తంగా మహాశివరాత్రి(Mahashivaratri) వేడుకల సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో పొరుగు దేశం పాకిస్థాన్(Pakistan)లోనూ వేడుకలు జరుగుతున్నాయి. పాక్‌లోని లాహోర్(Lahore)కు 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్లోని చారిత్రాత్మక కటాస్ రాజ్ ఆలయం ఉంది.
అక్కడ మార్చి 9న ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ బోర్డు ప్రతినిధి అమీర్ హష్మీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62మంది భారతీయులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పాక్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి తీర్థయాత్రకు బయలుదేరే ముందు, భక్తులు బుధవారం అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయాన్ని సందర్శించారు. మార్చి 6 నుంచి 12 వరకు పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న కటాస్ రాజ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారతీయ హిందూ యాత్రికులకు పాకిస్థాన్ హైకమిషన్ వీసాలు జారీ చేశారు.
విశ్వనాథ్ బజాజ్ నేతృత్వంలో వచ్చిన హిందువులకు వాఘా వద్ద ధార్మిక స్థలాల అదనపు కార్యదర్శి రాణా షాహిద్ సలీమ్ స్వాగతం పలికారు. యాత్రికులు మార్చి 10న లాహోర్‌కు తిరిగి వస్తారు. మార్చి 11న లాహోర్ లోని కృష్ణ దేవాలయం, లాహోర్ కోట, ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మార్చి 12న భారత్‌కు తిరిగి వస్తారు.