బీజేపీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెల్చి14 శాతం ఓట్లు తెచ్చుకొన్న విషయం తెలిసిందే.. రాష్ట్రంలో బలపడుతున్నామనే ధీమాతో ప్రస్తుతం తక్కువలో తక్కువ రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో ముందుకు వెళ్తుంది. మొదటగా రామమందిర సెంటిమెంట్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొన్న కమలం.. తెలంగాణ (Telangana) నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లను నడపారు.
ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది ఉచితంగా అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. అలాగే ఓటర్ల మనస్సు గెలుచుకోవాలని.. చేసిన ప్రతి అభివృద్ధిని.. పెట్టిన ఖర్చుని ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా నేతలు కృషి చేస్తున్నారు.. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ విజయానికి అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు.
బీజేపీ (BJP) కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న అమిత్ షా (Amit Shah) పర్యటనపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ (Parliament) ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. అనుకూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవాలని సూచించారు.
ప్రధాని మోడీ (PM Modi) అదిలాబాద్, సంగారెడ్డి సభలు విజయవంతం అయ్యాయని తెలిపిన కిషన్ రెడ్డి.. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ సంకల్పయాత్ర విజయవంతమైందని తెలిపారు.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ విజయాన్ని ఆపలేరని అన్నారు..