తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో వేసవికి ముందే మంచినీటి సమస్య ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు.. బోరుబావుల్లో నీరు అడుగంటి పోవడంతో వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ జలాలు ప్రమాదకరంగా పడిపోయాయి.. దీంతో నగర వాసులకు సక్రమంగా నీటిని సరఫరా జరగడం లేదని తెలుస్తోంది.
మరోవైపు రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 43-450 సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుందని తెలుస్తోంది. అదీగాక ప్రతి సారి మార్చి నుంచి మే మధ్య ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుంది, కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి వాటర్ ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ఏడాది బోరుబావులు ఎండిపోవడంతో మరిన్ని వాటర్ ట్యాంకర్ల అవసరం ఏర్పడింది.
హిమాయత్ సాగర్ (Himayat Sagar), సింగూరు, అక్కంపల్లి (Nagarjunasagar), ఎల్లంపల్లి (Godavari)లో నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో 580 వాటర్ ట్యాంకర్లు 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) సరఫరా చేస్తున్నాయి. ఈ వేసవిలో అదనపు డిమాండ్ ను తీర్చేందుకు ప్రైవేటు ట్యాంకర్లను జలమండలి అద్దెకు తీసుకోనుంది. వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను పెంచబోతోంది. నీటికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రెండు షిఫ్టులు పని చేపిస్తోంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తమ ఇతర అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు, అపార్ట్ మెంట్స్, విల్లాల్లో ఉన్న వారు.. అదేవిధంగా కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు లాంటివి కూడా తమ అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడతారు.
ఈ నేపథ్యంలో గోదావరి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి ఎక్కువ నీటిని ఎత్తిపోసి పైపుల ద్వారా సరఫరాను పెంచాలని HMWSSB యోచిస్తోంది. ఇక నీటి సరాఫర ట్యాంకర్ల ధరలు చూస్తే.. డొమెస్టిక్ ట్యాంకర్ ధర 5 వేల లీటర్ల నీటికి రూ.500, వాణిజ్య ట్యాంకర్ కు రూ.850 ఉండగా, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు..