కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీరుపై గులాబీ అధిష్టానం సైతం తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతుంది.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీకి సీఎం గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు.. అందుకే బీజేపీ నేతలు ఎన్ని మాటలు అన్నా స్పందించరన్నారు..
తెలంగాణ (Telangana) భవన్ లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు అభ్యర్ధులు లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని మరుసటి రోజు పార్లమెంట్ అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు.. దీన్నిబట్టి తెలంగాణలో వారు ఎంత బలహీనంగా ఉన్నారో అర్ధం అవుతుందని చురకలు అంటించారు.. ఇన్ని రోజులు మీరు పెంచి పోషించిన అభ్యర్ధులకు ఢీ కొట్టే దమ్ములేక మా నుంచి తీసుకొంటున్నారా అని ప్రశ్నించారు..
బీజేపీ సిద్ధాంతాలు పక్కనపెట్టి పక్క పార్టీల నుంచి అభ్యర్ధులను తీసుకోవడం వల్ల విలువలు కోల్పోతుందని ఆరోపించారు.. మరోవైపు బీఆర్ఎస్ పై కావాలని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మండిపడ్డారు.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏక్ నాథ్ షిండే వస్తాడని ఇప్పటికే నాలుగు సార్లు మాట్లాడిన బీజేపీ నేతల విమర్శలకు స్పందించే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని అధికారంలో నుంచి త్వరలో దింపేస్తామని బీజేపీ నాయకులు నేరుగా మాట్లాడుతుంటే, వాళ్లని నిలువరించే దమ్ము ఆయనకు లేదని, మోడీ (Modi) వస్తే వంగి వంగి దండాలు పెడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.. ఎన్నికల ముందు మోడీని కలవ వలసిన అవసరం రేవంత్ కి ఏముందని ప్రశ్నించారు.. దీనిపై కాంగ్రెస్ నేతలే చర్చించుకొంటున్నారని తెలిపారు.