సీఎం జగన్(CM Jagan) ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే శ్రీలంక అధ్యక్షుడి(Srilanka President)కి పట్టిన గతే పడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)అన్నారు. మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్లిపోతే.. ప్రతి ఆటో డ్రైవర్, ప్రతి మహిళ.. శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా అలాగే వాడుకుంటారని అన్నారు. సీఎం జగన్‌కూ అలాగే జరగదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో చూశారని ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరని అని పవన్ అన్నారు.
తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప.. నాశనం ఉండదన్నారు. తనపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నానని జనసేనాని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమేనని స్పష్టం చేశారు. 150 మందితో జనసేనను ప్రారంభించామని ఇవాళ 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారని తెలిపారు.
తాను ఒక ఆశయం కోసం వచ్చిన వాడినని, ఓడిపోయినప్పుడు శూన్యమనిపించిందని చెప్పారు. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చానన్నారు. వైకాపా, జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని చెప్పారు. తొక్కేయాలని చూస్తే తామూ తొక్కేస్తామన్నారు. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోందన్నారు. ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవనుకున్నారు.
పవన్ కల్యాన్ పోటీ చేసే స్థానం ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.