యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024(Lok Sabha Elections 2024)కు సంబంధించిన షెడ్యూల్ శనివారం(రేపు) విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ఎక్స్(x) వేదికగా వెల్లడించారు.
లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానుంది. కోడ్ అమల్లోకి వస్తే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు.
కాగా ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈసీ ప్రకటించే ఎన్నికల షెడ్యూల్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. బీజేపీ రెండు విడుతలుగా ఇప్పటికే 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
అటు కాంగ్రెస్ 82 మంది పేర్లను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా వెస్ట్ బెంగాల్లో తమ అభ్యర్థులను వెల్లడించింది. మరోవైపు ఖాళీగా ఉన్న ఈసీ ప్యానెల్‌లోని పోస్టులకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నిన్న ప్రధాని నేతృత్వంలోని కమిటీ నియమించింది. సుఖ్ బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లు ఇవాళ ఎన్నికల కమిషనర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరు ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమారికి ఎన్నికల నిర్వహణలో సాయం చేయనున్నారు.