Telugu News » Telangana : కవిత అరెస్టు ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు..!

Telangana : కవిత అరెస్టు ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు..!

మద్యం కేసుకు, తెలంగాణ ప్రజలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు.

by Venu

ఢిల్లీ (Delhi) మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టు తెలంగాణ (Telangana)లో సంచలనంగా మారింది. ఈ చర్యను నిరసిస్తూ.. బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బస్సు డిపోల ముందు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎవరు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

మరోవైపు నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు రోడ్లపై బైఠాయించారు. ప్రధాని మోడీ (Modi) దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.. సిద్దిపేట (Siddipet) పాత బస్టాంట్‌ చౌరస్తాలో సైతం ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మోడీ కేడీ అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్‌ (Karimnagar) జిల్లా.. గంగాధర మండల కేంద్రంలో సైతం బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఆదిలాబాద్‌లో వ్యాపార, వాణిస్య సముదాయాలు సంపూర్ణంగా బంద్‌ పాటిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మీర్‌పేటలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో బోరబండ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సైతం నిరసనలతో హోరెత్తింది.. ఇల్లందు పట్టణంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అశ్వారావుపేట రింగురోడ్డు సెంటర్‌లో పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మద్యం కేసుకు, తెలంగాణ ప్రజలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే.. నేడు చేయడం విడ్డూరమన్నారు.. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారని వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

You may also like

Leave a Comment