పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (BJP) తెలంగాణ (Telangana)పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎలక్షన్లను సీరియస్‌గా తీసుకొన్న కమలం పార్టీ వరుస సభలతో హోరత్తిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో నిన్న మల్కాజిగిరి (Malkajigiri) రోడ్‌షోలో పాల్గొన్న ప్రధాని, నేడు నాగర్‌కర్నూలు (Nagarkurnool)లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుపై గురి పెట్టిన కమలం. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. మోడీ (Modi) మోనియా, బీజేపీ సానుకూల వేవ్‌తో రిజర్వ్డ్ స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది.. ఇక రాష్ట్రంలో బీజేపీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా ప్రధాని బహిరంగ సభ కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు..
బీఆర్ఎస్ (BRS) పై ఉన్న కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని విమర్శించారు.. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని మోడీ ఆరోపించారు. ఈ రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలని విమర్శించారు.
మరోవైపు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకొనేలా ప్రణాళికలు రచించారు. ప్రధాని సభతో పార్లమెంట్ ఎన్నికలకు కలిసికట్టుగా సన్నద్ధం అయ్యేలా సందేశం ఇస్తున్నారు. ఇక కవిత అరెస్టు నేపథ్యంలో నాగర్ కర్నూలు సభపై అందరి చూపు ఉందని తెలుస్తోంది.