ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు మహిళలు అండగా నిలబడతారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కవిత అరెస్టు అక్రమని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఎమ్మెల్సీ కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి, కాంగ్రెస్కు లేదన్నారు.
అరెస్టులు ఉద్యమాలు కేసీఆర్ కుటుంబానికి కొత్త కాదని తెలిపారు. కుట్రలో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలు రాగానే ప్రతిపక్ష పారీటల నాయకులపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు. న్యాయపరంగా కోర్టులో పోరాడుతామని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యఓడు రాజు నాయక్, కందుల మండలం అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.