ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టు పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ ఘటనను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు.
ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం ఈ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించిన రేవంత్.. కవితను అరెస్ట్ చేయడం ద్వారా వచ్చే క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడుతుందని.. దీని ద్వారా బీఆర్ఎస్ సానుభూతిని పొందే అవకాశం ఉందని భావించి ఈ విధంగా చేశారని మండిపడ్డారు.. ఇక కవితను అరెస్ట్ విషయంలో ఒక తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా అయినా కేసీఆర్ స్పందించక పోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు..
రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 సీట్లు గెలవబోతున్నదని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఆ విజయానికి అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్, బీజేపీ ఈ చీఫ్ పొలిటికల్ డ్రామాకు తెరలేపారని రేవంత్ ధ్వజమెత్తారు. ఇకనైనా మోడీ, కేసీఆర్ ఈ డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేది.. కానీ నిన్న మాత్రం మోడీ, ఈడీ కలిసే వచ్చారని సెటైర్ వేశారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ నిరంతర ధారావాహిక సీరియల్ లాగా లిక్కర్ స్కామ్ నడిపిస్తున్నారని సీఎం ఆరోపించారు.
అలా సాగుతున్న వీరి ధారావాహిక సీరియల్ అరెస్ట్ డ్రామాతో.. పతాక స్థాయికి వెళ్ళిందని ఎద్దేవా చేశారు. మోడీ చేస్తున్న చౌక బారు విమర్శలు సరికాదని సూచించారు. రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసిన మోడీ కి తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణా అనే మాట మాట్లాడే అర్హత కూడా మోడీకి లేదని మండిపడ్డారు. 10 ఏండ్ల కేసీఆర్ అవినీతి పై ఎందుకు కేసు పెట్టలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు..