భారత్లో ముస్లింలు ఎంతో స్వేచ్చగా ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) తెలిపారు. కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన ముస్లింలను మాత్రమే సీఏఏ అడ్డుకుంటుందన్నారు. హైదరాబాద్లోని హమారా సంకల్ప్ వికసిత్ భారత్.. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్(Fir Ek Bar Modi Sarkar) కార్యక్రమంలో భాగంగా అడ్వకేట్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. సీఏఏ దేశంలో ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే, దేశ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీకి సపోర్ట్ చేయాలని లక్ష్మణ్ సూచించారు.
ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజల మనోగతాన్ని తీసుకుని మేనిఫెస్టో తయారు చేయడానికి బీజేపీ సిద్ధం అయ్యిందన్నారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుక బడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ముందుకు వచ్చామని తెలిపారు. కేవలం బీజేపీ మేనిఫేస్టోలా కాకుండా ప్రజల మేనిఫెస్టోలా ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
కాగా, అమలు చేయలేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో సైతం అమలు పరచలేని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. అక్కడ పరిస్థితి చూస్తే హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి వంద రోజులు కావస్తున్నా హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు.
మరోవైపు ప్రధాని మోడీ ప్రభుత్వం స్వయం శక్తిపై ప్రజలు నిలబడే పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ముందుచూపు ఉన్న గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పారు. భారత్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేవలం కుటుంబం కోసం పని చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ, రాహుల్ కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ తన కొడుకును, కూతురిని, ముఖ్యమంత్రి చేయడానికే పని చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. అయితే, దేశం, ప్రజల కోసం పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోడీ అని ఆయన పేర్కొన్నారు.