ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender)పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Assembly Speaker Gaddam Prasad Kumar)కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA’s) ఫిర్యాదు చేశారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అదేవిధంగా ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌ను కలవడానికి ప్రయత్నించారు.
అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 8.30 గంటల వరకు ఆయన కోసం ఎమ్మెల్యేలు నిరీక్షించారు. ఇంట్లో లేకపోవడంతో స్పీకర్‌కు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో రెండున్నర గంటలు స్పీకర్ నివాసం వద్ద నిరీక్షించి వెనుదిరిగారు. సీఎం ఒత్తిడితోనే ఆయన తమను కలవలేదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఇవాళ(సోమవారం) స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌పై వేటు వేయాలని ఫిర్యాదు చేశారు.