భగ్గుమంటున్న ఎండలతో అల్లాడుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించినట్లైంది. హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ(సోమవారం) అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. వాతావరణం చల్లబడింది. మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురిసింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు గ్రేటర్‌లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఈరోజు చలి వాతావరణం ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, గాలిలో తేమ 46 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, ద్రోణి ప్రభావంతో చల్లబడిన నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.
కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.