2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. మంగళవారం రైజింగ్ భారత్ సమ్మిట్(Rising India Summit)లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
బుల్లెట్ రైలు కోసం 500 కిమీల ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. భారత్ మాత్రం 8-10 సంవత్సరాల్లోనే పూర్తిచేస్తుదని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును పూర్తిచేయనున్నట్లు చెప్పారు. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలెక్కనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ముందుగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు నడపనున్నట్లు రైల్వే మంత్రి వివరించారు. 2028 నాటికి ముంబై-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్- ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే.. 2.58 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చన్నారు. 2028 నాటికి అహ్మదాబాద్-ముంబై పూర్తి మార్గం అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. జపాన్ షింకన్ సెన్ టెక్నాలజీని ఉపయోగించి హైస్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోందన్నారు. రూ.1.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.