రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో తెలంగాణ (Telangana) రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందుకొన్న కాంగ్రెస్ (Congress), లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) సైతం ఇదే జోరును కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ (BRS) నుంచి వరుస చేరికలతో కాంగ్రెస్ పునర్వైభవాన్ని సంపాదించింది.
అయితే నేతలు ఎక్కువైతే పదవులు పలుచబడటం కామన్.. ప్రస్తుతం హస్తంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశించే వారు ఎక్కువ అవడంతో అధిష్టానం జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందుకే ఎంపీ అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ (BJP) సైతం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే తమ అభ్యర్దులను ఖరారు చేసింది.
ఈ క్రమంలో ఆలస్యం విషమని భావిస్తున్న కాంగ్రెస్ తమ అభ్యర్దుల తుది జాబితా ప్రకటనకు సిద్దమైందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పోటీ చేసే నలుగురు అభ్యర్దులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులకు ధీటుగా తమ అభ్యర్దుల బలా బలాలను బేరీజు వేసుకొని, తాజాగా పార్టీలో చేరిన వారికి ఎక్కడ అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు మహబూబ్‌నగర్-వంశీచంద్ రెడ్డి.. మహబూబాబాద్, బలరాం నాయక్.. జహీరాబాద్, సురేశ్ షెట్కార్.. నల్లగొండ, కుందూరు రఘువీర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని, చేవెళ్ల అభ్యర్థిగా.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను ఎంపిక చేశారని సమాచారం.
నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి.. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ.. మెదక్ నుంచి నీలం మధు.. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఈనెల 21న ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఖరారులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్.. ఏమాత్రం బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినా రాజకీయ మార్పులు వేగంగా జరిగే అవకాశాలున్నట్లు అంచనా వేసి ఆచితూచి ముందుకు సాగుతుందని తెలుస్తోంది.