మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sathenapally)లో అసమ్మతి సెగ చుట్టుముట్టింది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరిలో అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు.
సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును స్థానికులకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో ఇమడలేక మదమంచి రాంబాబు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోయారు. మదమంచి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ కోసం నాలుగు ఎకరాలు సొంత భూమి అమ్ముకున్నానని తెలిపారు. వైసీపీలో తనకు ప్రాధాన్యత లేదన్నారు. పదవి ఉన్నా కూడా తాను సామాన్య కార్యకర్తగానే ఉన్నానని తెలిపారు.
సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని.. అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటీచేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. ‘అంబటి వద్దు, జగన్ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకు వద్దని డిమాండ్ చేశారు.