కాంగ్రెస్ (Congress) ప్రభత్వంపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే గులాబీ నేతలు ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారాయి. అదీగాక రైతులను దగా చేస్తుందని.. అన్ని విధాలుగా అన్నదాతలకు అన్యాయం చేస్తుందనే ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
ఇగో ఇదే కాంగ్రెస్ తెలంగాణలో (Telangana) తెచ్చిన మార్పు అంటూ బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన నీటితో గత సంవత్సరం మార్చి నెలలో దిగువ మానేరు జలాశయం కళకళలాడిందని, ఇతర జిల్లాలకు తాగు, సాగు నీరందించిందని పేర్కొంది. ఆదేవిధంగా జూన్ నెల వరకు కూడా రిజర్వాయర్‌లో నీరు నిలువ ఉన్నదని, యాసంగి వరిసాగుకు ఆయకట్టు భూములకు పూర్తి స్థాయిలో సాగునీరందించిందని తెలిపింది.
అయితే ప్రస్తుత రాష్ట్రంలో అధికారం చేబట్టిన కాంగ్రెస్ ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయకపోవడం, కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును సక్రమంగా వినియోగించక పోవడంతో మధ్యలోనే రిజర్వాయర్ ఖాళీ అయిందని ఆరోపించింది. మరికొద్దిరోజుల్లో డెడ్‌స్టోరేజీకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందే అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది..
అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నదని బీఆర్ఎస్ ట్విట్టర్ (X) వేదికగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే నాడు మార్చి 2023, నేడు మార్చి 2024 రిజర్వాయర్ ఫోటోను పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారి చర్చలకు దారితీస్తుందని అంటున్నారు.. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదం వల్ల నిందలు తాము మోయవలసి వస్తుందని మండిపడుతున్నారు..