లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) బీఆర్ఎస్ పార్టీని ఆగమాగం చేస్తున్నాయని అనుకొంటున్నారు.. ఇప్పటికే నేతలు గులాబీ అధినేత మాటలు పట్టించుకొక పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారనే ఆరోపణలున్నాయి.. ఇదే సమయంలో మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఇప్పటికే పార్టీలు మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గానూ పలువురు అభ్యర్థులను ప్రకటించేశాయి.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం స్కామ్ పేరిట మునిగిపోతున్న పార్టీని పైకి తేవడానికి బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారని అనుకొంటున్నారు. ఈమేరకు పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. ఇప్పటికే ఎంపీ (MP) అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కానీ ఐదు స్థానాలపై మాత్రం పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోందని తెలుస్తోంది. ఒకప్పుడు దర్జాగా రాష్ట్రాన్ని శాసించిన పార్టీ.. అభ్యర్థులు లేక అలమటిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పెండింగ్ లో ఉన్న మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయిని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పెండింగ్ స్థానాల అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడుతున్నట్లు చర్చించుకొంటున్నారు. ఇక నల్గొండ (Nalgonda) నుంచి బరిలోకి దింపడానికి మొదట గుత్తా అమిత్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ పరిశీలించింది.
అయితే అమిత్ రెడ్డి పోటీకి నో చెప్పడంతో సైదిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సైదిరెడ్డి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి వెళ్లడంతో మరొక అభ్యర్థి కోసం గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ కోసం కంచర్ల కృష్ణారెడ్డి, కడారు అంజయ్య యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక భువనగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి తలసాని సాయికిరణ్ పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్థి కోసం ఎదురు చూపులు తప్పడం లేదంటున్నారు..
అదేవిధంగా సికింద్రాబాద్ కోసం పద్మారావు, దాసోజు శ్రావణ్, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అటు మెదక్ అభ్యర్థి విషయంలో కూడా తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. అలాగే హైదరాబాదులో పోటీ నామ మాత్రమే కావడంతో మిగిలిన నాలుగు స్థానాలపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.