తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నేతలందరూ సాయన్నకు నివాళులర్పించారు. సాయన్న సేవలను స్మరించుకున్నారు సీఎం. ఆయన లేని లోటు పూడ్చలేనిదని.. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలని పరితపించారని గుర్తు చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
అయితే.. ఈ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగినట్టు చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు మంత్రి కేటీఆర్ వెళ్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు పది నిమిషాల పాటు వీళ్లిద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం.
గత బడ్జెట్ సమావేశాల సమయంలోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ ఉన్న దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి కేటీఆర్ పలకించారు. ఈటలతో స్పెషల్ గా మాట్లాడారు. హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. దానికి తనను ఎవ్వరూ పిలవ లేదంటూ బదులిచ్చారు ఈటల. ఆ సమయంలో ఈ వార్త వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.