Telugu News » Telangana : పాపాల పుట్ట.. ఉమామహేశ్వరరావు దాష్టీకాలెన్నో..!

Telangana : పాపాల పుట్ట.. ఉమామహేశ్వరరావు దాష్టీకాలెన్నో..!

ఉమామహేశ్వరరావు సీసీఎస్ అడ్డాగా కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీలను కాపాడేందుకే పని చేస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఇంకెంతమంది ఇలా ఉన్నారో. ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో వీరందరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.

by Venu

– వరుస కేసుల్లో గులాబీ లీడర్లు
– అధికారులను అడ్డం పెట్టుకుని వ్యవహారాలు
– ఎర్రబెల్లిపై బీజేపీ నేత శరణ్ చౌదరి ఫిర్యాదు
– సీసీఎస్ పోలీసులు రాధాకిషన్, ఉమామహేశ్వరరావుపైనా సంచలన ఆరోపణలు
– ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో వినిపిస్తున్న రాధాకిషన్ పేరు
– ఒక్కొక్కటిగా వెలుగులోకి ఉమామహేశ్వరరావు బాగోతాలు
– కేసీఆర్ ఫ్యామిలీ బినామీలను కాపాడతారనే అపవాదు
– సీసీఎస్ లో ఆయన పనే అదేనంటూ ప్రచారం
– గతంలో జరిపిన బెదిరింపులు, దాడులపై కొత్తగా చర్చ

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు భారీగా అవినీతికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కాళేశ్వరం కాక పుట్టించగా, ఈమధ్య టానిక్ క్యూ లిక్కర్ దందా నిషా తెప్పించింది. నేషనల్ లెవల్ లో కవిత లిక్కర్ స్కాం వ్యవహారం నిదుర పట్టనీయకుండా హైరానా పెడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చి తలనొప్పిగా తయారైంది. ఇలా వరుసబెట్టి బీఆర్ఎస్ అధిష్టానాన్ని, గులాబీ నేతలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ కేసుల్లో ఎక్కువగా కీలకంగా వ్యవహరించింది అధికారులే. ఇప్పుడు వారందరికి కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. సరిగ్గా ఇదే టైమ్ లో మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో కూడా పోలీస్ అధికారుల పాత్ర బయటపడింది.

the-development-of-temples-was-under-cm-kcr-rule-says-minister-errabelli

వివాదం ఏంటి..?

మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫేవర్ చేసేందుకు తనను చిత్రహింసలకు గురిచేశారని సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీకి కంప్లయింట్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి ఆన్ లైన్ లో చేసిన ఈ కంప్లయింట్ ప్రస్తుతం అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా డిపాజిట్లు సేకరించానని పేర్కొంటూ తనపై కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని ఫిర్యాదు చేశారు శరణ్. బీఆర్ఎస్ హయాంలో సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు, డీసీపీ రాధాకిషన్ రావు తనను అక్రమంగా నిర్భంధించి అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేరిట తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించారని, తాను పీఎస్ లో ఉన్న సమయంలో మరో 50 లక్షల నగదును తన ఫ్యామిలీని బెదిరించి తీసుకొన్నారని శరణ్​ చౌదరి ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాలు తెలుసుకున్న పోలీసులు

శరణ్ ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను తెప్పించుకొని కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, హైదరాబాద్ వచ్చిన వెంటనే అన్ని వివరాలు వెల్లడిస్తానని శరణ్ చెప్పారు.

వివాదాల ఉమామహేశ్వరరావు

బీఆర్ఎస్ ముఖ్య నేతల అండ చూసుకొని కొంత మంది పోలీస్ అధికారులు రెచ్చిపోయారనే ఘటనలు ఈమధ్య బాగా వెలుగుచూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ శాఖలో కీలకంగా వ్యవహరించిన వారి బాగోతాలు బయటకొచ్చాయి. ఇప్పుడు శరణ్ ఇష్యూలో రాధా కిషన్ రావుతోపాటు ఉమామహేశ్వరరావు పేరును బాగా హైలైట్ చేశారు. తనను హింసించాడని, రిజిస్ట్రేషన్ కు ఒప్పుకోకపోవడంతో బూటు కాళ్లతో తన్నాడని, విపరీతంగా కొట్టాడని సీఎంకు వివరించారు. గతంలోనూ ఈ ఉమామహేశ్వరరావుపై అనేక వివాదాలు ఉన్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి హలాయుధ ఇన్ఫ్రా సంస్థ డైరెక్టర్లు వల్లభనేని వెంకట బుచ్చిబాబు, నడగడ్డ వేణు గోపాల్ ను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై వారు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తమ తప్పు ఏమీ లేకపోయినా కావాలని తమను సీసీఎస్ కు పిలిచి దాడి చేసి వేధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఉమామహేశ్వరరావు ఇంకెన్ని అరాచకాలకు పాల్పడ్డాడో అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఒక్కొక్కరుగా ఆయన బాధితులు బయటకు వస్తారని అనుకుంటున్నారు.

ప్రభుత్వ అధికారులా? గులాబీ పని మనుషులా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు మరికొంత మంది ఉన్నతాధికారుల పేర్లు బయటకొచ్చాయి. ఇక సీసీఎస్ లో ఉమామహేశ్వరరావు బండారం బట్టబయలైంది. అసలు, వీళ్లు ప్రభుత్వ అధికారులా? లేక కల్వకుంట్ల ఫ్యామిలీకి సేవకులా? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు సీసీఎస్ అడ్డాగా కల్వకుంట్ల ఫ్యామిలీ బినామీలను కాపాడేందుకే పని చేస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఇంకెంతమంది ఇలా ఉన్నారో. ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో వీరందరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.

 

You may also like

Leave a Comment