వలంటీర్లపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP).. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వలంటీర్లను మాత్రం సమర్థించేది లేదన్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వలంటీర్లు వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకైన వలంటీర్లపైనే సుధీర్ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నట్లు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. వలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని అచ్చెన్నాయుడు కోరారు.