బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తల, నేతల పరిస్థితి స్వేచ్ఛను కోల్పోయిన బానిసలా మారిందని భావించి.. హస్తం గెలుపుకోసం పిడికిళ్ళు బిగించారు.. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే.. ఆ పార్టీనే నమ్ముకొన్న వారికి విలువ దక్కుతుందని ఆశించారు.. కానీ తెలంగాణలో ప్రభుత్వాని ఏర్పాటు చేశాక పాత రోత.. కొత్త వింతలా మారిస్థితి ఏర్పడిందని వాపోతున్నట్లు చర్చించుకొంటున్నారు..
పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి.. అధికారంలో ఉన్నప్పుడు మూడు చెరువుల నీళ్ళు తాగించిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం కొంత మంది సీనియర్లు, కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరికల అంశం హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తోంది. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు తాము గేట్లు ఓపెన్ చేశామని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి..
పలువురు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం.. వచ్చి రాగానే వారికి ఎన్నికల్లో సీట్లు.. అది కాకుంటే.. పదవులు కట్టబెట్టడంతో కొందరు సొంత పార్టీ నేతలు ఉడికిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (Kichannagari Lakshma Reddy), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ను మోసం చేసిన దొంగలను పార్టీ లోపలికి తీసుకొస్తే మా లాంటి నాయకులు, కార్యకర్తలు మళ్లీ చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నేడు చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా.. ఆలోచించుకొనే విధంగా మారాయని అనుకొంటున్నారు..