రాష్ట్రంలో అగ్ని గుండలా రగులుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్న విషయ తెలిసిందే.. అందరూ అందరే.. కానీ అసలైన దొంగలు ఎవరని ఒకరినొకరు ఆరోపించుకొంటున్న తీరు ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోందని అనుకొంటున్నారు.. బీఆర్ఎస్ విషయంలో వస్తున్న విమర్శలు.. ఆరోపణలు ఆసక్తికరంగా మారి.. కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నట్లు చర్చలు మొదలైయ్యాయి..
అయితే బీజేపీ నేతలు సైతం ప్రతి విషయంలో తీవ్ర విమర్శలు చేయడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రెండో బాధితుడు రఘునందన్ రావు (Raghunandan Rao) అని పేర్కొన్నారు..
మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ఆరోపించారు.. అదేవిధంగా విపక్ష నేతలతో పాటు హరీష్ రావు (Harish Rao) భార్య, కవిత (Kavitha) భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా రేవంత్ ను టార్గెట్ చేసిందని.. చివరికి కూతురి పెళ్లికి పేరోల్ మీద రావలసి వచ్చిందని గుర్తు చేశారు..
ఇంత జరిగిన దీనికి బాధ్యులైన అధికారులను సీఎం ఎందుకు క్షమిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు నిన్న ముగ్గురు మాజీ మంత్రుల రహస్య భేటీ జరిగిందని తెలిపిన రఘునందన్.. మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించినట్లు ఆరోపించారు.. ఆ రెండు గంటల పాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ నేను చెప్పింది తప్పని భావించి నోటీసులు పంపిస్తే.. నా వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తానని వెల్లడించారు.. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరిని ఇరికించి.. మరి కొందరిని కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించిన రఘునందన్ రావు.. ఈ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. లేదా సీబీఐ పై నమ్మకం ఉంటే వారితో విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు..