తెలంగాణలో మరో ఉపఎన్నిక (ByPoll) రావడం తప్పదా? అని ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Mla Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మరణించగా అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. అయితే, త్వరలోనే ఖైరతాబాద్ లేదా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని జోరుగా చర్చజరుగుతోంది.
ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్(Mla Danam Nagender) ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Mla Padma Rao Goud) కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి(G.Kishan ReddY) కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కూడా అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ ఎంపీ ఎన్నిక క్లిష్టంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో కిషన్ రెడ్డి కాకుండా ఎవరూ గెలిచినా రాష్ట్రంలో మరో ఉపఎన్నిక తప్పేలా లేదని టాక్.
ఎందుకంటే దానం, పద్మారావు గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరైనా ఒక్కరు ఎంపీగా గెలిచినా తమ అసెంబ్లీ స్థానాలకు వీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ మళ్లీ కిషన్ రెడ్డి గెలిస్తే ఉపఎన్నిక అవసరం ఏమీ ఉండదని వినికిడి.