– ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
– పోలీసుల అదుపులో రాధా కిషన్ రావు, గట్టుమల్లు
– భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి కోర్టు అనుమతి
– 5 రోజులపాటు వారిని ప్రశ్నించనున్న సిట్
– డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
– కేసీఆర్ ఫాంహౌస్ లో ఇప్పటికీ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దూకుడు పెంచిన అధికారులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, సీఐ గట్టుమల్లును అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.
గతంలో ఎస్‌ఐబీలో గట్టుమల్లు సీఐగా విధులు నిర్వహించారు. అదేవిధంగా రాధా కిషన్, గట్టుమల్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకొన్న దర్యాప్తు బృందం.. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాలను రాధా కిషన్ తూచ తప్పకుండా పాటించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభాకర్ రావు చెప్పిన వ్యాపారులను టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్లు టాక్ వినిపిస్తోంది. అదీగాక ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘా పెట్టి కొట్టేసినట్లు సైతం ప్రచారం జరుగుతోంది.
అదేవిధంగా రాధా కిషన్ ప్రతిపక్ష నేతల ఇళ్లపై నిఘా పెట్టి ప్రతి విషయం అధికార పార్టీకి చేరవేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారులు ప్రభాకర్ రావు, రాధా కిషన్‌లే అనే వార్తలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదివరకే ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. అయితే, వీరిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి.
5 రోజులపాటు వారిని కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. అయితే, ప్రణీత్ రావు కస్టడీకి మాత్రం ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ ఘటనపై లక్డీకపుల్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ 2021లో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయం నుంచి జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఈ అరాచకాలు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న వార్ రూంలో ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. పోలీసులు వార్ రూంపై దాడి చేసి, ఆధారాలను సేకరించాలని డీజీపీని కోరినట్లు కాంగ్రెస్ నేతలు కోరారు.