టీడీపీ(TDP) అభ్యర్థుల తుది జాబితా(Final List)ను విడుదల చేసింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. కదిరి స్థానంలో అభ్యర్థిని మార్చింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా.. చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు.
కదిరిలో కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్ కేటాయించారు. సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్ సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది.
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, పాడేరు నుంచి కె.వెంకటరమేశ్ నాయుడు, దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మిని బరిలో నిలిపారు. వీరితో పాటు రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యంకి టికెట్‌ను ఖరారు చేశారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గానికి వీరభద్ర గౌడ్, గుంతకల్లు, నుంచి గుమ్మనూరు జయరామ్ పోటీ చేయనున్నారు.
అదేవిధంగా అనంతరపురం అర్భన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి నుంచి కందికుంట నియోజకవర్గం నుంచి వెంకట ప్రసాద్‌కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే.. విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డిలను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.