కారు దిగి కాంగ్రెస్(Congress)లో చేరిన కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ఫైర్ అయ్యారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాకానీ బీఆర్ఎస్ను వదలనన్న కడియం నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి రాత్రి పూట లంకెబిందెలు వేతికే వ్యక్తి అని చెప్పిన కడియం శ్రీహరి ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. ఈ వయసులో పార్టీ మారడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్రలో ఐదేళ్లకు మించి పాలించిన చరిత్ర లేదని, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ద్రోహం చేసిన కడియంకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు.
కడియం శ్రీహరి వెళ్లిన తర్వాతే బీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. ద్రోహం చేసిన కడియంకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేసీఆర్ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేశారని, కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నాన్ని తొలగిస్తే వరంగల్ అగ్ని గుండం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు.
డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణ మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అది చేయలేదన్నారు. రుణమాఫీ చేయని కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలన్నారు. రైతులకు రైతు బంధుకు ఇవ్వాల్సిన డబ్బులను కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. మహిళలకు ఇస్తామన్న రూ.10వేలు ఇచ్చాకే ఓట్లు అడగాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తుపాన్ వస్తే తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వబోమని అంటే నోరు తెరవని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.